India vs England First T20: అభిషేక్ ఊచకోత.. ఇంగ్లాండ్ జట్టుపై భారత్ గ్రాండ్ విక్టరీ
India vs England First T20 Match in Kolkata india victory: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్..నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బల్లర్(68) పరుగులతో రాణించగా.. ఓపెనర్లు విఫలమయ్యారు. సాల్ట్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అర్ష్ దీప్ ఓవర్లలో డకెట్ (4) కూడా ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన బ్రూక్(17) పర్వాలేదనిపించిన షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే లివింగ్ స్టోన్(0)ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ పంపాడు. బెతెల్ (7), ఓవర్టన్ (2), అట్కిన్సన్ (2), ఆర్చర్ (12), రషీద్ (8) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ 132 పరుగులను మాత్రమే రాబట్టింది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్ల పడగొట్టగా.. అర్ష్ దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ తలో రెండు వికెట్లు తీశారు.
133 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన భారత్ సులువుగా ఛేదించింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శాంసన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడుతున్న శాంసన్(26) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం దూకుడు ఆపలేదు. వరుస హిట్ షాట్లతో బంతులను మైదానం అవతలి వైపు తరలించారుడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 100 పరుగుల మార్క్‌ను దాటింది. తిలక్ వర్మ(19) సహకారంతో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు. ఇంకా 9 పరుగులు చేయాల్సి ఉండగా.. అభిషేక్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్(3) పరుగులు చేయగా.. భారత్ కేవలం 12.5 ఓవర్లకే 133 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఒక వికట్ తీశాడు. ఇక, రెండో టీ20 మ్యాచ్ చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.