Last Updated:

U19 Asia Cup: తొలి మ్యాచ్‌లోనే తడబాటు.. పాకిస్థాన్‌తో భారత్‌కు తప్పని ఓటమి

U19 Asia Cup: తొలి మ్యాచ్‌లోనే తడబాటు.. పాకిస్థాన్‌తో భారత్‌కు తప్పని ఓటమి

IND vs PAK Match Pakistan beats India by 43 runs: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్‌ షాజైబ్‌ ఖాన్‌ సెంచరీ, మరో ఓపెనర్ ఉస్మాన్‌ ఖాన్‌ అర్ధ శతకంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తర్వాత వచ్చిన టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిఖిల్ కుమార్‌, ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. భారత బ్యాటర్లు ఏ దశలోనూ పాక్ జట్టుకు చెక్ పెట్టలేకపోయారు. మొత్తంగా.. తొలి మ్యాచ్‌లో తడబడిన టీమిండియా రేపు జపాన్‌తో తలపడనుంది.

ఇదిలా ఉండగా, అండర్ 19 ఆసియా కప్- 2024లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కు చెందిన 13 ఏళ్ల బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుతో పెవిలియన్‌కు చేరాడు. అలీ రజా బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాద్ బేగ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. వేలంలో ఈ కుర్రాడి కోసం రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడగా, చివరికి రాజస్థాన్ రూ. 1.1 కోట్లతో వైభవ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య ఆసియా కప్‌లో బరిలో దిగిన వైభవ్ పాక్ మ్యాచ్‌లో చతికిలపడ్డాడు.