Last Updated:

Gujarat : మోదీ మ్యాజిక్ … గుజరాత్ లో వార్ వన్ సైడ్

ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.

Gujarat : మోదీ మ్యాజిక్ … గుజరాత్ లో వార్ వన్ సైడ్

Gujarat Elections: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్దాయి విజయం వెనుక కారణాలివే.

ప్రచారసారధిగా మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి గుజరాత్‌ ఎన్నికలను ముందుండి నడిపించారు. అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో 31 ర్యాలీలు మరియు రెండు ప్రధాన రోడ్ షోలతో ప్రచారాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. హోంమంత్రి అమిత్ షా దాదాపు నెల రోజుల పాటు గుజరాత్‌లో క్యాంప్ చేసి ప్రచారాన్ని మరింత బిగించి, బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని పూర్తిగా పుంజుకునేలా చేశారు.గత వారం అహ్మదాబాద్‌లో మోదీ చేసిన 50 కి.మీ రోడ్‌షో, ఇది అత్యంత సుదీర్ఘమైనదని నాలుగు గంటలలో 10 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని బీజేపీ పేర్కొంది. తన ర్యాలీలలో, మోదీ గుజరాతీ అస్మిత మరియు 2002 నుండి రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలను లేవనెత్తారు. గుజరాత్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడ జాతీయవాదాన్ని కూడ ప్రస్తావించారు. రికార్డ్ స్దాయి విజయంకోసం ఓటింగ్ శాతాన్ని పెంచాలని పార్టీ నాయకులను అభ్యర్థించారు.

సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం సహజం. దీనితో ఈ ఏడాదిసెప్టెంబరు 11న, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు అతని మంత్రివర్గం స్థానంలో కొత్త సిఎం మరియు మంత్రులను నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహాన్ని తొలగించింది.భూపేంద్ర పటేల్ అనే కద్వా పటేల్‌ను సీఎం చేయడంతో గుజరాత్‌లోని పటేల్ వర్గానికి భరోసా ఇచ్చినట్లయింది. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా సిఆర్ పాటిల్ ను నియమించారు.

బీజేపీ వైపు పాటిదార్ల మొగ్గు

గుజరాత్‌లోని ఓటర్లలో 13% మంది పాటిదార్లు ఉన్నారు.2017లో కాంగ్రెస్‌ వైపు వారు మారడం వల్ల అది 77 స్థానాలను గెలుచుకోగా బీజేపీ సీట్ల సంఖ్య 99 కు పడిపోయింది. 2015లో రిజర్వేషన్ కావాలంటూ చేసిన ఆందోళనలో 14 మంది పాటిదార్లు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. పటేళ్లు బీజేపీకి వ్యతిరేకంగా మారారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్డిక్ పటేల్ తరువాత కాలంలో పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. అయితే 2022 నాటికి పరిస్దితి మారిపోయింది. హార్డిక్ పటేల్ బీజేపీలో చేరారు. పాటిదార్లకు 10% EWS రిజర్వేషన్‌ను ఇవ్వడానికి బిజెపి తీసుకున్న చర్యతో వారు సంతృప్తి చెందినట్లు కనిపించారు. దీనితో వారు మరలా బీజేపీ వైపు మొగ్గారు.

కాంగ్రెస్ స్వయంకృతం

2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గుజరాత్‌లో నెల రోజుల పాటు గడిపి రాష్ట్రమంతటా దేవాలయాలచుట్టూ తిరిగి కౌంటర్ హిందూత్వను ప్రచారం చేసారు. దీనికి పాటిదార్ల వర్గం మద్దతు కూడ కలిసి నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్ బీజేపీ కి పోటీ ఇచ్చింది. కాని తాజా ఎన్నికలకు వస్తే ఈసారి ఆ పార్టీ ప్రచారం పేలవంగా ఉంది. అసలు ఓటర్లను రీచ్ కావడానికి ఏ మాత్రం కృషి చేయలేదు. యుద్దానికి ముందే ఆయుధాలు వదిలేసినట్లుగా కాంగ్రెస్ కనిపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేవలం రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. పక్కనే మహారాష్ట్రలో భారత్ జోడీ చేసిన రాహుల్ గుజరాత్ లో అడుగు పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలే అసంతృప్తి చెందారు. మిగిలిన ఛోటా మోటా నేతలు జోడో యాత్రలో తరించారు. దీనితో అధికార బీజేపీపైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు ఎందుకు ఓటువేయాలన్న భావన మెజారిటీ ప్రజల్లో కలిగింది.

మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ప్రతికూల ప్రచారం ఆ పార్టీకి చాలా నష్టాన్ని కలిగించింది. మధుసూదన్ మిస్త్రీ ప్రధానిపై ‘ఔకాత్’ వ్యాఖ్యను ఉపయోగించగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానిని ఉద్దేశించి ‘రావణ్’ వ్యాఖ్యను ఉపయోగించడం ఓటర్లకు మింగుడుపడలేదు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు తన ఎన్నికల ర్యాలీల్లో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశాన్ని మోదీ వదల్లేదుసాంప్రదాయకంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో కూడా బీజేపీ భారీ స్కోరు సాధించింది, అలాగే 2017లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున గెలిచిన సౌరాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది.

ప్రభావం చూపలేకపోయిన ఆప్

గుజరాత్‌లోప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ చాలా హైప్‌ను సృష్టించింది. దానికి తగ్గస్దాయిలో ఓట్లను మాత్రం సాధించలేకపోయిందిఅరవింద్ కేజ్రీవాల్ అనేక ర్యాలీలు మరియు రోడ్ షోలతో ప్రచారానికి నాయకత్వం వహించారు, కానీ, ప్రజలు ఆప్ ను ఇప్పటికీ బిజెపికి లేదా కాంగ్రెస్‌కు కూడా ప్రత్యామ్నాయంగా చూడలేదు.ఆప్ ఇచ్చిన ఉచిత వాగ్దానాలు కూడా గుజరాత్ ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ముస్లింలు ఇప్పటికీ కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే పట్టణ ప్రాంతాల్లో తన ప్రచార హోరుతో కొంతవరకూ బీజేపీని ఆందోళనకు గురిచేయగలిగింది.

ఇవి కూడా చదవండి: