Last Updated:

Russia Mystery Deaths : రష్యా ప్రముఖులు భారత్‌లో వరుసగా ఎందుకు చనిపోతున్నారు? ఈ మిస్టరీ మరణాలు హత్యలా? ఆత్మహత్యలా?

రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. సాధారణంగా ఒకరు, ఇద్దరు మరణిస్తే వీటి గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చేది కాదు...

Russia Mystery Deaths : రష్యా ప్రముఖులు భారత్‌లో వరుసగా ఎందుకు చనిపోతున్నారు? ఈ మిస్టరీ మరణాలు హత్యలా? ఆత్మహత్యలా?

Russia Mystery Deaths : రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. సాధారణంగా ఒకరు, ఇద్దరు మరణిస్తే వీటి గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చేది కాదు… కానీ ఏడాది కాలంలో ఏకంగా 24 మంది మృత్యువాత పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు నుంచే ఈ మిస్టరీ మరణాలు సంభవించడం గమనార్హం. ఇలా మరణించిన ప్రముఖుల్లో కొందరు పుతిన్‌ యుద్ధోన్మాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించినవారు ఉన్నారు. దీంతో ఈ మర్డర్ మిస్టరీల వెనుక పుతిన్‌ హస్తం ఉందని భావిస్తున్నారు.

ఇండియాలో 15 రోజుల్లో 3 మృతి…

ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో గత పదిహేను రోజుల్లో ముగ్గురు రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. పారాదీప్‌ ఓడరేవులో ప్రయాణిస్తున్న నౌక సిబ్బందిలో ఒకరైన సెర్జీ మిల్యాకోవ్‌ (50) మంగళవారం తెల్లవారుజామున నౌకలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్‌ పోర్టు నుంచి పారాదీప్‌ మీదుగా ముంబై వెళుతున్న ఆ నౌకకి సెర్జీ చీఫ్‌ ఇంజనీర్‌ గా వ్యవహరిస్తున్నారు. అనుకోని రీతిలో తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన శవమై కనిపించారు. సెర్జీ గుండెపోటుతో మరణించారని నౌకా సిబ్బంది భావిస్తున్నారు.

ఒడిశా రాష్ట్రం రాయగడ నగరంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్‌లో వ్లాదిమర్ బెడెనోవ్ (61) డిసెంబర్ 22న తాను ఉన్న హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత డిసెంబరు 24న (శనివారం సాయంత్రం) అదే హోటల్‌లోని పూల్‌లో రక్తసిక్తంగా పడి ఉన్న రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్‌ని హోటల్ సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆయన కూడా మరణించారు.హోటల్‌లోని కిటికీ నుంచి కిందపడటంతో ఆంటోవ్ మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే, హోటల్ సిబ్బంది ఎవరికీ పడిపోతున్న శబ్ధం ఏదీ వినిపించకపోవడం ఆశ్చర్యకరం.

ఈ సంఘటనలో మరణించిన పావెల్ ఆంటోనోవ్ రష్యాలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా లెక్కించబడ్డారు. రష్యాలోని అత్యంత సంపన్న పార్లమెంటేరియన్ల జాబితాలో పావెల్ పేరును ఫోర్బ్స్ చేర్చింది. ఫోర్బ్స్ ప్రకారం, ఆంటోనోవ్ $120 మిలియన్ల ఆస్తిని కలిగి ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు హడావిడిగా దహనం చేయడం మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తుంది.

ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖులు ఎవరంటే?

ప్రాణాలు కోల్పోతున్న రష్యన్లలో బిలయనీర్లు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, చమురు సంస్థల అధిపతులు, పెద్ద పెద్ద పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, మిలటరీ నాయకులు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు 37 ఏళ్లు కాగా 73 ఏళ్ల వయసు వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. రష్యా యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ఫ్రామ్‌ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ట్యూల్కోవ్‌ అనుమానాస్పదరీతిలో మరణించారు. యుద్ధాన్ని వ్యతిరేకించిన డాన్‌ రాపో పోర్ట్‌ గత ఆగస్టులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మన దేశంలో రాయగడలో మరణించిన ఎంపీ పావెల్‌ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించినవారే. ఆయన మరణించిన రోజే రష్యా నావికాదళానికి చెందిన అలెగ్జాండర్‌ బుజెకోవ్‌ కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో వాసిలీ మెల్నికోవ్‌ తన భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి శవమై కనిపించారు. జులైలో ప్రభుత్వ కాంట్రాక్టర్‌ యూరీ వోరోనోవ్‌ తన ఇంట్లో స్విమ్నింగ్‌పూల్‌లో రక్తపు మడుగులో శవమై తేలారు.

ఆత్మహత్యలా ? హత్యలా ??

రష్యా ప్రముఖులు మరణాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నట్టు ప్రచారంలో ఉంది. ఎత్తయిన భవనాల మీద నుంచి, గదుల్లోని కిటికీల నుంచి, నౌకల నుంచి దూకడం, తమని తాము కాల్చుకోవడం, గుండె పోట్లు వంటి ఘటనలతో మరణించడం ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. లుక్‌ ఆయిల్‌ చైర్మన్‌ రావిల్‌ మాగ్నోవ్‌ గత సెప్టెంబర్‌లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి తన గది కిటికీ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇలా మరణిస్తున్న వారిలో సంపన్నులే ఎక్కువ. వారి చుట్టూ అంగరక్షకులు ఉంటారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న అనారోగ్యం వచ్చినా అత్యుత్తమ వైద్య సేవలు తీసుకునే సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వారి మరణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇవి కూడా చదవండి: