RTC Strike : ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్

RTC ready for strike in Telangana : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి జనవరి 27వ తేదీన ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుంచి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు.
ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట..
బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఇటీవల అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించింది. ‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని తీర్మానించాయి. మే 7వ లేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు, భేషజాలను విడనాడి జేఏసీతో కలిసి రావాలని కోరింది. కార్మిక ప్రయోజనాల పరిరక్షణతోపాటు సర్కారు కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.