Bird Flu Effect: తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మాంసం ధరలు!

Meat prices Increased Due to Bird Flu Effect: ఏపీతో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. యాద్రాది జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసులు నమోదైంది. మరోవైపు పలు జిల్లాలో వేల కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. గత రెండు రోజులుగా చికెన్‌తో పాటు గుడ్లు కూడా తినడం మానేశారు. ఈ క్రమంలో మటన్, చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు తగ్గుతుండగా.. మటన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని పలు చోట్ల కేజీ చికెన్ రూ. 150 నుంచి 170 మధ్య అమ్ముతుండగా.. నల్గొండలో రూ.150, మహబూబ్ నగర్ రూ.160, వరంగల్, రూ .180 వరకు లభిస్తుంది. అయినప్పటికీ అమ్మకాలు అంతంతమాత్రమే ఉన్నాయని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. గత వారంరోజులుగా సేల్స్ పూర్తిగా పడిపోయాయని వాపోతున్నారు. దీంతో పాటు చికెన్ బిర్యానీ పాయింట్లలో 50 శాతం వరకు అమ్మకాలు పడిపోయాయని ఆందోళన చెందుతున్నారు.
చికెన్ ప్రియులు ఇప్పుడు మటన్, చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని చేపలు, మటన్ షాపుల వద్ద భారీగా క్యూ కట్టారు. గతంలో కిలో చేపలు రూ.100 పలకగా.. ఇప్పుడు రూ.350 వరకు పలుకుతున్నాయి. చేపలతో పాటు రొయ్యలు, పీతలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో కిలో మటన్ ధర రూ.700 నుంచి రూ.800 పలుకుతుండగా.. తాజాగా, రూ.100 నుంచి రూ.200 వరకు పెంచేశారు. దీంతో ప్రస్తుతం కిలో మటన్ రూ.1000 వరకు పలుకుతుంది.