Harish Rao : మాపై కోపంతో అప్పుల లెక్క ఎక్కువ చేసి చూపొద్దు.. హరీశ్‌రావు

Harish Rao : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మార్పు పేరుతో అనేక వాగ్దానాలు ఇచ్చారని, గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చడం మార్చిపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని, ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఇవాళ జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీతులు చెప్పారని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్‌తో పోలుస్తూ అధికార కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గతేడాది అంచనాలు పెంచి చూపించారని, ఇప్పుడు బడ్జెట్ అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి, బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని ఆరోపించారు. చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు అంటూ కామెంట్ చేశారు. రైతు భరోసా పథకం పేరు మార్చేశారని, డబ్బులు మాత్రం ఇవ్వలేదన్నారు. కౌలు రౌతులకు రైతు బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు.
భూములు లాక్కుంటున్న ప్రభుత్వం..
గతంలో ఫార్మా సిటీకి భూములు సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హామీనిచ్చారని, ఇప్పుడు మళ్లీ భూములు లాక్కుంటామని అంటున్నారని తెలిపారు. ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి తిరిగి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.
అమ్మ కానికి గచ్చిబౌలి భూములు..
గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారని, టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు అప్పు తెస్తామని అంటున్నారని చెప్పారు. ఆ రోజు ఫార్మాసిటీకి తాము భూములు సేకరిస్తుంటే భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడేమో 14 వేల ఎకరాలు లాక్కుంటామని అంటున్నారని విమర్శించారు.
కౌలు రైతుల ప్రస్తావనే లేదు..
ఈసారి బడ్జెట్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదన్నారు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫాం కుట్టుకూలీ పెంచినట్లు చెప్పారని, కుట్టుకూలీ రూ.50 నుంచి రూ.75కి పెంచినట్లు చెప్పారన్నారు. రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాపీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ గొప్పలు చెప్పారని, సీఎం ప్రచారంతో తెలంగాణకు పెట్టుబడులు ఆగిపోయాయంటూ ఫైర్ అయ్యారు.
రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపాం..
తెలంగాణను నెంబర్ 1గా నిలిపామని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ విధానాలు, పరిపాలనలో దివాళాతనం కనిపిస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలు ఆవిరయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కోటిమంది ఉపాధిహామీ కూలీలు ఉన్నారని తెలిపారు. లక్షలోపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారన్నారు. ప్రతిపక్షం సూచనలు తీసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. 2014లో రూ.62వేల కోట్ల నుంచి 2023 నాటికి రూ.2.31 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయం 4 రెట్లు పెంచామని తెలిపారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రూ.49,500 కోట్లు కావాలన్నారు.