Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీకి అందాల భామలు.. ఘనస్వాగతం పలికిన సిబ్బంది

Miss World Contestants: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపటేషన్స్ జరుగుతున్నాయి. కాగా 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మే 10 నుంచి పోటీలు ప్రారంభమవగా.. మే 30న ఫైనల్ జరగనుంది. కాగా ఈ పోటీలకు 109 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ కు చేరుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు, అతిథులు నగరానికి విచ్చేశారు. వీరికి ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. అందాల భామలు, అతిథులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, పర్యాటక ప్రదేశాలు, వంటకాలు, విశిష్టతలు తెలిసేలా అందాల భామలకు అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సుందరీమణులు సందర్శించారు. తాజాగా ఇవాళ వీరంతా హైదరాబాద్ నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో సందడి చేశారు. ఫిల్మ్ సిటీలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్కడి వింతలు, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వీరికి రామోజీ ఫిల్మ్ సిటీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అలాగే అందాల భామల పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.