KCR : కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయండి.. సీఎంను కలిసిన గజ్వేల్ నేతలు

KCR : బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సహా సభ్యులు సవాల్ విసిరారు. శాసన సభకు వచ్చి పతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సభ్యులు మాట్లాడారు. అయినా కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకూ రాలేదు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోడంపై చర్చించుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, నియోజకవర్గానికి సైతం రావడం లేదని గజ్వేల్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందించనున్నారు.