Published On:

BRS Party: అందగత్తెల కాళ్ల వద్ద ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు.. రేవంత్‌పై కేటీఆర్, సబిత ఆగ్రహం

BRS Party: అందగత్తెల కాళ్ల వద్ద ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు.. రేవంత్‌పై కేటీఆర్, సబిత ఆగ్రహం

BRS Party Fire on Congress Government about miss world contestants issue: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 20 దేశాలకు చెందిన అందాల భామలు వరంగల్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అయితే వీరంతా తెలంగాణ సంప్రదాయంలో భాగంగా కట్టు, బొట్టుతో వచ్చారు. అయితే గుడిలోకి వెళ్లే సమయంలో కాళ్లు కడుక్కునేందుకు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

 

అయితే, ఈ సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరీమణి కాళ్లు కడుక్కున్న తర్వాత తుడవాలంటూ టవల్‌ను ఎదురుగా ఉన్న మహిళలకు ఇచ్చారు. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో కాళ్లు తుడవాల్సి వచ్చింది. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందాల బామల కాళ్ల వద్ద రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.

 

తెలంగాణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన అతిథికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ అని, ఇలా కాళ్లు తుడిపించడం ఏమిటని మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఇదేనా తెలంగాణలో మార్పు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించి రాష్ట్ర ఆడబిడ్డలను అవమానించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. వీర వనితలు పుట్టిన నేలపై రాష్ట్ర ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందన్నారు. యావత్ మహిళా లోకానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీయుల కాళ్లు కడిగించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని, ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరూ కూడా ఇప్పటివరకు బాగుపడినట్లు చరిత్రలో లేదని సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

 

కాగా, రామప్ప ఆలయ సందర్శనలో మిస్ వరల్డ్ కంటెస్టంట్లను కూర్చోబెట్టి కాళ్లు కడిగించడం, టవల్‌తో తుడిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అధికారికంగా మతిస్థిమితం కోల్పోయారని కేటీఆర్ విమర్శలు చేశారు.