Revanth Reddy : ఫ్యూచర్ సిటీ.. పెట్టుబడుల నగరం : ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy : ప్రజాసంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి..
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని చెప్పారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన అన్నారు. బడ్జెట్‌లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ.. ప్రజలు నివసించే నగరమే కాదు.. పెట్టుబడుల నగరం అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్నారు. ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని స్పష్టం చేశారు.
పేదలు సన్నబియ్యం తినాలి..
శ్రీమంతుల మాదిరే పేదలూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో గతేడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించామని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదన్నారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా 60-65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారని సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలోని మన తెలంగాణంలో ఓ వెలుగు వెలగాలన్నారు. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు ఆకలిని దూరం చేసేందుకు నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇవాళ సాయంత్రం హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుపై అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
గవర్నర్‌తో సీఎం భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గంటకుపైగా జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.