Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు.. హత్యేనని అనుచరుల అనుమానాలు!

Pastor Ajay on Pastor Praveen Pagadala Death: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయని ఆయనది మరణం కాదు హత్య అంటూ ఆయన అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.. మంత్రులు అనిత, లోకేష్ ప్రవీణ్ మృతిపై స్పందించారు.
అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ పగడాల తనకు ప్రాణహాని ఉందని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ పోస్టుల్లో గౌరవ షమీ గారికి, మీరు కోరిన బహిరంగ క్షమాపణ ఇచ్చేస్తాను.. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జీహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవధ చేయకండి తెలుగు రాష్ట్రాల ప్రజలారా ప్రభుత్వాల్లారా నన్ను షమీ ఉగ్రవాదం నుండి కాపాడండి అంటూ పోస్ట్ చేసారు. ముస్లిం ప్రజలారా నన్ను క్షమించండి.. నేనిచ్చిన సమాచారాన్ని మళ్లీ పరిశీలించండి.. చాలామంది కామెంట్స్ లో విపరీత ఉగ్రవాద ధోరణిచూపిస్తున్నారంటూ ఫేస్ బుక్ లో మరో పోస్ట్ చేసారు ప్రవీణ్ పగడాల.. ప్రవీణ్ ఈ పోస్ట్ లు ఎందుకు పెట్టారు.. ప్రవీణ్ చనిపోతే ఇంతమంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు. బ్రాహ్మణులు, ముస్లింలపై ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేసారా.. అసలు ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారా.. హత్యకు గురయ్యారా.. ప్రవీణ్ తల్లితండ్రులది మతాంతర వివాహమా.. కడపకు చెందిన ప్రవీణ్ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో క్రైస్తవ మతబోధనలు చేయడానికి కారణం ఏంటి..?
ప్రవీణ్ పగడాల ఏపీలోని కడపజిల్లాలో పుట్టి పెరిగారు.. తండ్రిది కడప, ఆయన తల్లి ప్రొద్దుటూరుకు చెందినవారు. ప్రవీణ్ తల్లితండ్రులతో మతాంతర ప్రేమ వివాహం.. ఆయన తల్లి హిందువు కాగా, ప్రవీణ్ తండ్రి ముస్లిం.. చిన్నతనంలో ప్రవీణ్ ను మసీదుకు నమాజ్ నిమిత్తం తీసుకెళ్లేవారు తండ్రి.. చిన్నతనం తర్వాత తండ్రి ఏమయ్యారు.. అనే విషయాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.. అన్నయ్య తల్లితోపాటు ప్రవీణ్ పెరిగారు.. ప్రొద్దుటూరు నుండి ప్రవీణ్ ను చదువు నిమిత్తం కడపలోని హాస్టల్ లో చేర్చగా ప్రవీణ్ అక్కడే పెరిగారు. చిన్నతనం నుండే అల్లరి, గొడవల్లో ఉండేవారు ప్రవీణ్.. ఒకసారి తన అన్నయ్య ను కొట్టినందుకు ఒకరిపై స్నేహితులతో దాడిచేయగా ఆవ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ బంధువులు ఆయనను కేసు నుండి కాపాడారు.. అలా ప్రవీణ్ వివిధ వ్యసనాలకు లోనవుతున్నప్పుడే ఇంట్లో వాళ్లంతా ఆయనను హైదరాబాద్ పంపించేసారు. ఆ సమయానికి ప్రవీణ్ కు హల్లెలూయ అని చెప్పడం, తెల్లబట్టలు వేసుకోవడం, ప్రార్ధనలు చేయడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.. ఆసమయంలో 1996లో హైదరాబాద్ లో స్నేహితుడి ద్వారా క్రిష్టియన్ యూత్ మీటింగ్ కు హాజరైనపుడు నీవీ ప్రపంచానికి వెలుగై ఉన్నావు అంటూ యేసు ప్రభువు చెప్పడం, ఒకరోజు నిద్ర పోతున్నపుడు యేసు ప్రభువు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ గురించి చెప్పగా ఇండోర్ కి వెళ్లి క్రైస్తవ మత బోధ అని తెలుసుకుని అక్కడికి వెళ్లారు.. అక్కడి కొన్నిరోజులు రోజులు రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు. హిందీ నేర్చుకుని అక్కడి ప్రజలకు బైబిల్ బోధించేవారు.. ప్రవీణ్ బోధలు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసేవి.. ప్రవీణ్ సేవగురించి టీవీల్లోనూ ప్రసారం జరిగేది.. అక్కడి ఓ క్రైస్తవ పాస్టర్ కుటుంబం ప్రవీణ్ కు ఆశ్రయమిచ్చింది.. మంచివాడు కావడంతో తమ కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేసారు.. అలా 2006లో వివాహం జరిగింది..
అనంతరం ప్రవీణ్ రెండు తెలుగురాష్ట్రాలు, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బైబిల్ బోధ చేస్తున్నాడు.. ఎంబీయే చదవడంతో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించి అనేకమందికి ఉపాధినిస్తున్నారు. కంపెనీలో లాభాల డబ్బును చారిటీకి ఉపయోగిస్తున్నారు. పేద పిల్లలకు, వితంతులవులకు, అనాధలకు సేవచేస్తున్నారు. ఈక్రమంలోనే సిద్ధాంతపరమైన విబేధాలతో కొందరు హిందూ, ముస్లిం మత పెద్దలతోనూ వివాదాలయ్యాయి. సిద్ధాంతపరంగా హిందూ, ముస్లిం విధానాలను వ్యతిరేకించడంతో షమీఅనే ముస్లిం వ్యక్తి ప్రవీణ్ ను హెచ్చరించారని, వారే చంపిఉంటారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ మృతి వివరాలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు వెల్లడించారు. ప్రవీణ్ బావమరిది ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం చేయించామని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించామని వెల్లడించారు. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్రవాహనంపై వెళుతున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. సోమవారం రాత్రి గం. 11.43 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని తెలిపారు. సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలన్నారు.
ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. ప్రవీణ్ పగాడల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరాతీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. వారిఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబసభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని.. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.