Road Accident Ananthapur Distict : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Road Accident Ananthapur Distict : పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తగారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను, వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతరం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు మృతిచెందారు.
వివరాల్లోకి వెళ్తే.. రాయంపల్లికి చెందిన సరస్వతీ తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతరం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తగారింటికి వస్తోంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుంచి అనంతపురానికి వెళ్తున్న కారు ఎదురుగా ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతీతోపాటు ఆమె మూడు నెలల కుమార్తె విద్యశ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు..
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆటో, కారును క్రేన్ సాయంతో పోలీసులు రోడ్డు పక్కకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆస్పత్రికి వద్దకు చేరుకున్న బంధువులు బోరున విలపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగీశ్వరి మృతిచెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు కీలక సూచనలు..
వాహనదారులకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. కచ్చితంగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తోందని చెప్పారు.