AP & Telangana Road Accident: రక్తపాతమైన రోడ్లు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 గురు మృతి!

6 People died in Ap and Telangana Road Accident’s: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఏపీ, తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంగా వచ్చిన స్కార్పియో ఆర్టీసీ బస్సు, పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినవారిగా గుర్తించారు. పోలీస్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డి సహా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధరించారు. ఒంటిమిట్ట, రాజంపేటకు చెందిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జనగామ జిల్లాలో లారీని ఢీకొన్న కారు..
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు కియా కారు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు