Last Updated:

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం : సీఎం చంద్రబాబు

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం : సీఎం చంద్రబాబు

P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని, అందుకే వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ‘పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్టనర్‌షిప్‌గా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’ నినాదంతో పీ-4 విధానానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.

 

 

నా జీవితం ప్రజలకే అంకితం : చంద్రబాబు
పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తనకు ఏ కోరికలు లేవన్నారు. ప్రజలు, యువత భవిష్యత్ బాగుండాలని ఆలోచించిన వ్యక్తిని అన్నారు. సుపరిపాలన, మంచి రాజకీయాలను తాను ఎప్పుడూ నమ్ముతానని చెప్పారు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించినట్లు చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితం అన్నారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు అన్నారు. అన్ని విషయాల్లోనూ తనకు ఎన్టీఆరే ఆదర్శమన్నారు. ఆయన స్ఫూర్తితోనే 50 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. పాతికేళ్ల కింద తీసుకొచ్చిన ఐటీ రంగంతో తెలుగు యువత బాగుపడ్డారని గుర్తుచేశారు. రైతు కూలీల పిల్లలు ఇవాళ అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.

 

 

తాము చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోందన్నారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు ఏయే మంచి పనులు చేయాలనే తాను ప్రతిరోజూ ఆలోచిస్తానని, ఇప్పుడు సాయం పొందిన వాళ్లలో అనేకమంది కోటీశ్వరులవుతారని స్పష్టం చశారు. పీ-4 విధానంలో ప్రభుత్వం మెంటార్‌గా ఉంటుందని, ప్రతి ఇంటికీ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పీ-4 విధానం సమాజంలో గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని చెప్పారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

 

 

ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుంది : పవన్‌ కల్యాణ్‌
తెలుగు ప్రజలు బాగుండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు, నా ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు చెప్పారు. సమర్థ నాయకుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందని కొనియాడారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని, ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్నవారే అద్భుతాలు చేస్తారన్నారు.

ఇవి కూడా చదవండి: