Chandrababu : ప్రభుత్వ పథకాలతో సంబంధం లేదు.. పీ-4 లక్ష్యం అదే : సీఎం చంద్రబాబు

Chandrababu : ధనవంతులు, పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యంగా పీ-4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగస్వామ్యం కావడానికి ఎన్నారైలతోపాటు
ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చని పేర్కొన్నారు. ఈ విధానం అమలులో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధిపొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. పీ-4 విధానంపై ఇవాళ సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ విధానం అమలు తీరుపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు.
మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
పీ-4 అమల్లో భాగంగా ముందుగా గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిపొందే కుటుంబాల జాబితా రూపొందిస్తారని, తొలుత దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్నదే సంకల్పంగా కూటమి సర్కారు ముందుకెళ్తోందన్నారు. ఉగాది పండుగ రోజు అమరావతిలో పీ-4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు.
పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలి..
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎండాకాలం ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలు తగ్గించాలన్నారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు.