Kakani Govardhan Reddy : చిక్కుల్లో మాజీ మంత్రి కాకాణి .. ఆయనపై కేసు నమోదు

Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఏ4గా కాకాణి గోవర్ధర్‌రెడ్డి చేర్చారు. 120బీ, 447, 427, 379, 220, 506, 129తోపాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్డు కింద కేసు పెట్టారు.
కేసు నేపథ్యం..
నెల్లూరు జిల్లాలో క్వార్జ్ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వైసీపీ హయాంలో ఓ మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అక్కడ కోట్ల విలువైన సంపద కొల్లగొట్టారు. గతంలో ఒకరికి ఇచ్చిన లీజు గడువు ముగిసిపోవడంతో వైసీపీ నేత దానిపై కన్నేసి అక్రమంగా మైనింగ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాకాణి గోవర్ధన్‌రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అక్రమ మైనింగ్ జరుగుతున్న క్వారీ వద్ద టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజుల కింద సత్యాగ్రహం చేశారు. సంపద తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఇదే విషయంపై గతంలోనే కేంద్రం మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ శాఖ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గోవర్ధన్‌రెడ్డి నాలుగో నిందితుడిగా చేర్చారు.