Ajit Pawar: శరద్ పవార్ రాజీనామాపై స్పందించిన అజిత్ పవార్
అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Ajit Pawar: రాజకీయ వ్యవస్థాపకుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక ప్రకటన వెల్లడించారు. ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ముంబైలో మంగళవారం జరిగిన తన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో శరద్ పవార్ తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే శరద్ పవార్ పార్టీ అద్యక్ష నుంచి తప్పుకోవడాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన వెంటనే తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శరద్ పవార్ రాజీనామా చేసిన సమయంలో ఆయన పక్కనే ఎమ్మెల్యే జయంత్ పాటిల్ కూడా కన్నీటి పర్యంతమైన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కార్యక్రమం జరిగిన ఆడిటోరియం నుంచి బయటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ‘ నేను రాజకీయాల్లోనే ఉంటాను. అయితే ఎన్నికల్లో పోటీ చేయను. మనమంతా కలిసి పనిచేద్దాం. నా రాజీనామాను ఆమోదించండి’ అని తెలిపారు.
పవార్ మార్గదర్వకత్వంలోనే(Ajit Pawar)
అయితే, శరద్ పవార్ రాజీనామా పై ఆ పార్టీ నేత అజిత్ పవార్ రియాక్ట్ అయ్యారు. ‘ ఎన్సీపీ కుటుంబానికి ఎప్పుడూ అధినేతగా పవార్ సాహెబ్ ఉంటారు. పార్టీకి కొత్త ఛీఫ్ వచ్చినా.. పవార్ మార్గదర్వకత్వంలోనే పనిచేస్తారు. పార్టీ నాయకత్వంలో మార్పు తప్పదని ఆయన కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వయసు, ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని గమనించాలి. సమయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం పవార్ సాహెబ్ చేసిందీ కూడా అదే. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. ప్రస్తుత పరిణామంపై ఏమీ మాట్లాడొద్దని సుప్రియా సూలేకు ఓ అన్నగా సూచిస్తున్నాను.’ అని ఆయన అన్నారు.
ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే
కాగా, 1999 లో కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించారు. అప్పటి నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. దాదాపు 24 ఏళ్లపాటు అధక్ష పదవి బాధ్యతలు చేపట్టిన పవార్.. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా వెల్లడించారు. సరిగ్గా 1960 మే 1వ తేదీన మేడే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైందని, మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి.. తన అనుచరులతో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది.