MLC elections: సీఎం జగన్ కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
MLC elections:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు ?..(MLC elections)
టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఎమ్మెల్యే కోటా కింద 7 స్థానాలకు వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీ పడ్డారు. టీడీపీ నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించడంతో.. వైసీపీ నుంచి ఆరుగురు మాత్రమే గెలుపొందే అవకాశం ఉంది.
సీరియస్ గా తీసుకున్న వైసీపీ..
ఇలా ఉండగా ఆనం, కోటంరెడ్డి కాకుండా అనూరాధకు ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది, వైసీపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై వైసీపీ నేతలతో చర్చిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది? ఎందుకు జరిగిందనే దానిపై చర్చ మొదలయింది. ఎమ్మెల్సీ పోలింగ్ కు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారని అన్నప్పటికీ ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని వైసీపీ నేతలు కొట్టి పారేసారు. అయితే ఇపుడు టీడీపీ అభ్యర్ది అనూరాధ గెలవడంతో వారు షాక్ తిన్నారు.
గురువారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసారు అకొడుకు పెళ్లి వల్ల వైసీపీ కి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటేశారు.ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడకు వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు.