Pawan Kalyan on YSRCP: వైసీసీపై పవన్ కల్యాణ్ విమర్శలు.. నిధులపై ఏమన్నారంటే..?

AP Deputy CM Pawan Kalyan Comments about YSRCP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న నిధుల దుర్వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురస్కరించుకొని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు.
గత పాలకులు గ్రామ పంచాయతీ నిధులను నిర్వీర్యం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే కొంతమంది నిధులను పనులు చేయకుండా దారి మళ్లించారన్నారు. కానీ ఈ సమయంలో బిల్లులు చెల్లించకపోయినా కొంతమంది గుత్తేదారులు పనులు చేశారని, వారందరికీ ధన్యవాదములు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టానని, పంచాయతీ రాజ్ శాఖను చాలా ఇష్టంతో తీసుకున్నట్లు చెప్పారు. గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు అని, గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మారాలని కోరారు. గ్రామాల్లో ఎక్కువగా ఉండేందుకు ఇష్టమని, కానీ కుదరలేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. గతంలో పలు తండాల్లో పర్యటించానని, అప్పుడూ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారులు ఎవరైనా అభివృద్ధి విషయంలో ఎలాంటి పైరవీలు చేయకూడదని, ఏమైనా తప్పులు చేసినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించారు.
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో తెలుగు వాళ్లు ఇద్దరు మృతి చెందారు. ఇందులో విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు ప్రాంతానికి చెందిన మధుసూదన్ మృతి చెందారు. ఈ మేరకు కావలికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మధుసూదన్ మృతదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కాగా, మరికాసేపట్లో మధుసూదన్ అంత్యక్రియు జరగనున్నాయి మరోవైపు చంద్రమౌళికి సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.