PM Modi: ఏఐతో కొలువులు పోతాయనేది అపోహే.. పారిస్ ఏఐ సదస్సులో ప్రధాని మోదీ
PM Modi co-chairs AI Action Summit in Paris: ప్రపంచ దేశాలు యువతకు నైపుణ్యాలు, అవసరాల మేరకు రీ-స్కిల్లింగ్ అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. ఈ విధానం తప్పదన్నారు. మంగళవారం నాటి ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ అధ్యక్షత వహించగా, ప్రధాని మోదీ సహ-అధ్యక్షత వహించి ప్రసంగించారు.
భయం వద్దు..
ఏఐ మూలంగా ఉద్యోగాలు పోతాయనే భయాలున్నాయని, అది పూర్తిగా అవాస్తమని మోదీ అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు యువతకు స్కిల్, రీ-స్కిల్ చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనుకున్న సమయం కంటే చాలా వేగంగా వినియోగంలోకి వస్తుందన్నారు. అందుకే.. ఈ రంగంలో పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, విలువల్ని పంచుకునేందుకు, ప్రమాదాలపై హెచ్చరించుకునేందుకు ఉమ్మడి కార్యచరణ అవసరం అని అభిప్రాయపడ్డారు.
ప్రారంభంలో ఉన్నాం
పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడుతూ, మానవజాతి దిశను నిర్దేశించే ఏఐ యుగం ప్రారంభంలో నేడు ప్రపంచం ఉందని, భారత్ తన వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనదైన భాషా ప్రధాన ఏఐ నమూనాను సృష్టిస్తోందని వెల్లడించారు. కంప్యూటింగ్ వనరులను సమీకరించడానికి ఇండియాకు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఉందని.. దీనిని స్టార్టప్‌లు, పరిశోధకులకు సరసమైన ధరకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ రూపకల్పనలోని అనుభవాలను, నైపుణ్యాలకు తమదేశం ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పక్షపాతం లేని ఏఐ కావాలి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ వనరులను, ప్రతిభను ఒకచోట చేర్చి, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని.. ఇందులో ఎలాంటి పక్షపాతానికి అవకాశం లేని నాణ్యమైన డేటాసెట్లను అభివృద్ధి చేసి ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలని మోదీ అన్నారు. ఏఐ ప్రజలే కేంద్రీకృతంగా పని చేసేలా ఉండాలని అభిప్రాయ పడ్డారు.
అభివృద్ధిలో కీలకంగా
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఇలా మరిన్ని రంగాలలో లక్షలాది మంది జీవితాలను మార్చడానికి ఏఐ సాయపడనుందని, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సులభంగా, వేగంగా చేరుకునే ప్రపంచాన్ని సృష్టించడంలో కూడా ఏఐ తప్పక సహాయపడుతుందని ఉద్ఘాటించారు.