Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ: ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్ర

4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ప్రహరీని ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రహరీ ఎత్తు, మందం, డిజైన్ విషయాలను ఫైనల్ చేశామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనుల గురించి సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణం మరో 6 నెలల్లో పూర్తికాబోతోందని తెలిపారు. రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 10 ఎకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలను జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని చెప్పారు.
ఆలయానికి బెదిరింపులు..
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధికారిక మెయిల్ ఐడీకి బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత పెంచారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆలయ గర్భగుడి శిఖరంపై భారీ కలశం..
రామాలయంలోని గర్భగుడి ప్రధాన శిఖరంపై భారీ కలశాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కలశ పూజా విధి నిర్వహించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న ఆరు దేవాలయాల పైభాగంలో కలశాలను మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఆలయ నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు నిరంతరం పనిచేస్తున్నారు.