PM Modi : ప్రతిపక్ష పార్టీలకు కుటుంబ ప్రయోజనాలకే ముఖ్యం : ప్రధాని మోదీ

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ముందుకుసాగుతోందని చెప్పారు. ఎన్డీయే కూటమి నేతలంగా ప్రతిఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట..
ప్రతిపక్షాలు ‘పరివార్ కా సాథ్ పరివార్ కా వికాస్’ అనే విధానాన్ని అనుసరిస్తాయని పేర్కొన్నారు. కానీ, దానికి విరుద్ధంగా తాము ఎప్పుడూ ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
2036లో ఒలింపిక్స్‌కు ఇండియా ఆతిథ్యం..
గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండేవని, కానీ నేడు కాశీ పూర్వాంచల్‌కు ఆరోగ్య రాజధానిగా మారుతోందన్నారు. ఇండియా అభివృద్ధి, వారసత్వం అనే రెండింటిలో ముందుకెళ్తోందన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని, అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కాశీ ఎప్పటికీ తనదేనని తేల్చి చెప్పారు. తాను కాశీకి చెంవదినవాడినని ప్రధాని మోదీ పేర్కొన్నారు.