Last Updated:

Karnataka CM: ‘కోర్టు తీర్పులాగే.. హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నా’

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్‌ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.

Karnataka CM: ‘కోర్టు తీర్పులాగే.. హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నా’

Karnataka CM: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్‌ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై శివకుమార్ స్పందించారు. మనమంతా ఓ కోర్టు తీర్పును స్వీకరించినట్టుగానే తానూ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి బాధ లేదన్నారు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలిపారు.

 

పార్టీ ప్రయోజనాలే ముఖ్యం(Karnataka CM)

‘ముఖ్యమంత్రి ఎంపిక అంశాన్ని మొదటి నుంచి అధిష్ఠానానికే వదిలేశాం. అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నేను కూడా హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాల్సిందే. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం’ అని శివకుమార్ అన్నారు. ‘సీఎం విషయంలో పార్టీ అధిష్ఠాన నిర్ణయం తుది తీర్పు లాంటిది. మనలో చాలా మంది కోర్టులో వాదిస్తూ ఉంటారు. చివరకు న్యాయమూర్తి చెప్పిన దాన్ని వింటాం. అదే విధంగా నేను కూడా పార్టీ హైకమాండ్‌ తీర్పును అంగీకరిస్తున్నా’ అని శివకుమార్ వ్యాఖ్యానించారు.

 

నా ఒక్కడి విజయం కాదు(Karnataka CM)

‘కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించకపోతే పరిస్థితి ఏంటీ? కానీ మేం గెలిచాం. కాబట్టి, దాని ఫలితాలను అందుకోవాలి. ఇది నా ఒక్కడి విజయం మాత్రమే కాదు. లక్షలాది మంది కార్యకర్తల శ్రమ ఉంది. వారి వైపు నుంచి కూడా మేము ఆలోచించాలి. ప్రజలు ఇంతటి భారీ విజయాన్ని అందించినప్పుడు కచ్చితంగా ఆనందపడాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇదే మా ప్రధాన అజెండా’ అని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారు.