Published On:

Bandi Sanjay : టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి బండి సంజయ్ లేఖ.. ఆ విషయంలో విజ్ఞప్తి

Bandi Sanjay : టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి బండి సంజయ్ లేఖ.. ఆ విషయంలో విజ్ఞప్తి

Union Minister Bandi Sanjay : కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకి లేఖ రాశారు. రెండేళ్లుగా వాయిదా పడిన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు. 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్‌లో పదెకరాలు స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. 2023 మే 31న రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ నిర్వహించినట్లు వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణంలో ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. కరీంనగ‌ర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వివరించారు.

 

 

దేవాలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి..
మీ నేతృత్వంలో టీటీడీ దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంతోపాటు హిందూ ఆలయాల నిర్మాణ అభివృద్ధికి సహకరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందని వెల్లడించారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకుని అనేక ఆలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల్లో కరీంనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో భూమిపూజ చేసిన స్థలంలో దేవాలయం నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ మద్దతుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చూడబోతోందని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో భక్తులంతా భక్తిపూర్వకంగా కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి, దివ్య కృపను పొందేందుకు ప్రేరణ ఇస్తుందని తెలిపారు. మీరు ఇప్పటికే చేపట్టిన కొన్ని మంచి చర్యలు భక్తుల నుంచి విశేషమైన ప్రశంసలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: