Traffic Police: రాంగ్ రూట్ లో వెళ్తున్నారా.. మీకు ఫైన్ పడినట్టే

Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తీర్ణం పెరగడం లేదు. దీంతో కొద్ది దూరానికే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏదైనా అత్యవసర పనికోసం బయటకు వెళ్తే ఇక అంతే సంగతులు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే పలు కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థను తీసివేసి.. యూటర్న్ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. అలాగే వాహనాల రద్దీని బట్టి ఆయా ఏరియాల్లో ఫ్లైఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది.
మరోవైపు భాగ్యనగరంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. అలాగే ప్రమాదాలకు కారణం అవుతోంది. ఇందులో ప్రధానమైన సమస్య రాంగ్ రూట్ డ్రైవింగ్. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలపై అధికారులు దృష్టి పెట్టారు. రద్దీ ఉన్న మార్గాల్లో రాంగ్ రూట్ లో వెళ్లే వాహనాలపై సామాన్య ప్రజలు, వేరే వాహనదారులు ఫోటోలు తీసి అధికారులకు పంపొచ్చు.
ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్లే వారి ఫోటోలను తీస్తే.. ఆ వాహనదారులకు ఫైన్లు వేస్తామని సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు. అలాంటి వారి ఫోటోలు, వీడియోలు పంపేందుకుగాను తమ వాట్సప్ నెంబర్ 9490617346 కు పంపాలని సూచించారు. అలాగే ఆ వాహనం వెళ్లిన లొకేషన్, టైమ్, డేట్ వంటి వివరాలను కూడా పంపించాలని ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.