Congress : బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ బీసీ నేతలు

Congress BC Leaders : టీ కాంగ్రెస్ బీసీ నేతలు శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిశారు. బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ, శాసన మండలిలో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపినందుకు టీ కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
42 శాతం రిజర్వేషన్లు..
స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మార్చి 18వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. మరుసటి రోజు మార్చి 19న శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాయి. అనంతరం రెండు బిల్లులను సర్కారు గవర్నర్‌కు పంపారు. గవర్నర్ బిల్లులను పరిశీలించి రాష్ట్రపతికి పంపారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కులగణన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. కులగణనను గతంలో విమర్శించిన వారే ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పోరాట ఫలితమే కేంద్ర కేబినెట్ నిర్ణయమన్నారు. రాహుల్ నినాదం ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందని చెప్పారు. రేవంత్ పాలనలో కులగణన జరగడంతో కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.