PM Modi Hyderabad Tour: మోదీ పర్యటన షెడ్యూల్.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనకు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నిఘాను కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా బేగంపేట-సికింద్రాబాద్ మార్గంతో పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలోనూ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసింగించనున్నారు.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే(PM Modi Hyderabad Tour)..
ప్రధాని మోదీ నేడు ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం వందేభారత్ రైలులో కొందరు విద్యార్థులతో కలిసి నల్గొండ వరకు ప్రయాణిస్తారు. ఆ తర్వాత 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ మైదానానికి చేరుకుని 11 వేల కోట్ల అభివృద్దికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అందులో 1365.95 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ 750 పడకల హాస్పటల్, తెలంగాణలోని 410 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరణ అభివృద్ధి, 720 కోట్ల సికింద్రాబాద్ రైల్వే అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే ఇప్పటికే పూర్తైన సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ రైలు, విద్యుదీకరణ ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేస్తారు. అంతేకాకుండా ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా వివిధ రూట్లలోని 13 రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం సభావేదికగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.