Komatireddy Rajagopal Reddy : ఆ శాఖ అంటే ఇష్టం.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

Komatireddy Rajagopal Reddy : తనకు ఆ శాఖ అంటే ఇష్టమని, కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఇవాళ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు హోం శాఖ అంటే ఇష్టమని, ఏ పదవి ఇచ్చినా సమర్థవంతగా నిర్వహిస్తానని మీడియాలో తన అభీష్టాన్ని బయటపెట్టారు. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని చెప్పారు.
నిన్న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో అధిష్ఠానం పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ చర్చినట్లు తెలుస్తోంది. ఇందులో పలు సామాజిక వర్గాల నుంచి నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులకు చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అసెంబ్లీ లాబీల్లో సైతం నేతలు మాట్లాడుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తోంది.
ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం?
మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.