CM Revanth Reddy : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నా బ్రాండ్ : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ సీఎంకు ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్య శ్రీని తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే అందరికీ తానే గుర్తొస్తానని చెప్పారు. ఇదే తన బ్రాండ్ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరికొందరు తెలంగాణ ఉద్యమాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఒలంపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయని, మనం దేశం ఎందుకు సాధించలేకపోతుందో ఒకసారి ఆలోచించాలని కోరారు.
సైనిక్ పాఠశాలల తరహాలో యంగ్ ఇండియా పాఠశాలలు..
తెలంగాణలో ఏటా లక్షలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్నారని, విద్యార్థుల్లో నాణ్యత ఎంతంటే ఎవరి దగ్గరా సమాధానం లేదన్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కనీసం అప్లికేషన్లు కూడా నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే యంగ్ ఇండియా పోలీస్ పాఠశాలను తీసుకొస్తున్నామన్నారు. సైనిక్ పాఠశాలల తరహాలో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తామని హామీనిచ్చారు. దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పోలీస్ స్కూల్ అంటేనే ఓ బ్రాండ్‌గా తయారు కావాలన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్ విధానం ప్రారంభిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కూల్‌కు రూ.100కోట్లతో కార్పస్ ఫండ్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు. అంతకముందు తరగతి గదులను సీఎం పరిశీలించారు. కాసేపు మైదానంలో పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడి ఉత్సాహం నింపారు.