Published On:

BRS: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు రూట్ మ్యాప్.. ఫోకస్ కేసీఆర్ స్పీచ్‌పైనే!

BRS: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు రూట్ మ్యాప్.. ఫోకస్ కేసీఆర్ స్పీచ్‌పైనే!

BRS Party Silver Jubilee Celebrations in Hanumakonda: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారు. ఈ సభలో బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

 

ఎల్కతుర్తిలో 169 ఎకరాల్లో సభ నిర్వహించడంతో పాటు 500 మంది కూర్చొనేలా బాహుబలి వేదిక ఏర్పాటు చేశారు. 45వేల వాహనాల కోసం సుమారు 1000 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే 20 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేశారు. ఈ సభను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ శ్రేణులు ఎడ్లబండ్లపై సభకు వస్తుండగా.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారని పార్టీ పేర్కొంది.

 

అంతేకాకుండా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు వెయ్యి మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సభ నేపథ్యంలో వరంగల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కరీంనగర్ నుంచి హనుమకొండ వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్ మీదుగా ఓఆర్ఆర్‌కు మళ్లించారు. హనుమకొండ నుంచి కరీంనగర్ వెళ్లే వాహనాలు ముచ్చర్ల క్రాస్, ఓఆర్ఆర్, కమలాపూర్ మీదుగా మళ్లించారు. అలాగే సిద్దిపేట నుంచి హనుమకొండ వచ్చే వాహనాలు జనగామ, తరిగొప్పుల మీదుగా మళ్లించారు.

 

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పైనే స్పెషల్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతారనే అంశంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద భారీ బహిరంగ సభ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం, దిశానిర్దేశం ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే, కేసీఆర్ ఇవాళ బహిరంగ సభలో దాదాపు గంట పాటు స్పీచ్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది.