TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం.. ఎప్పటి నుంచి అంటే?

TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెంకన్న దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం, రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖను అనుమతి ఇవ్వనున్నారు. సిఫార్సు లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించనున్నారు. ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానం కోసం ఆదివారం ఏపీ ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించనున్నట్లు పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయించిందని మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరింది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై రెండు రోజుల కింద బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ చెప్పింది. కానీ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. వేసవి సెలవుల్లో తమ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు, సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు టీటీడీ పాలకమండలితో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలో టీటీడీ స్పందించింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పిస్తామని ప్రకటించింది.