Pahalgam Terror Attack: అలా ప్రాణాలను రక్షించుకున్నాం- ప్రత్యక్ష సాక్షి!

Eyewitness Statement on Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ కళ్లముందే తోటివారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. ‘పర్యాటకులపై జరిగిన దాడిని కళ్లారా చూశాను. ఉగ్రవాదులు టూరిస్టులపై ఫైరింగ్ చేశారు, దిక్కుతోచని స్థితిలో చెరోవైపు పరిగెత్తాం’. అని ప్రత్యక్ష సాక్షి శశిధర్ వెళ్లడించాడు. ఘటనలో ఆయన స్నేహితుడు విశాఖ (Visakhapatnam) నివాసి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడని కన్నీటిపర్యంతమయ్యాడు.
చంద్రమౌళి మృతదేహాన్ని విమానంలో తీసుకురాగా శశిధర్ కూడా వెంట వచ్చారు. ఎయిర్ పోర్టులో అప్పటికే స్నేహితులు, బందువులు ఎదురుచూస్తున్నారు. వారిని చూసిన వెంటనే అతను బోరుమన్నాడు. మరో రోజును చూస్తాననుకోలేదని కన్నీరుకార్చాడు. పహల్గాంలో ఒక్కసారిగా ముష్కరులు దాడిచేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాలేదని అన్నారు. దుండగులకు దొరక్కుండా పరిగెత్తే క్రమంలో ఫోన్ కూడా ఎక్కడో పడిపోయిందని చెప్పారు. సమాచారాన్ని ఇంటికి చేరవేయలేక పోయామన్నారు. మరో స్నేహితుడు రమణమూర్తి ఫోన్ సాయంత్రం లభించిందని తమ క్షేమసమాచారాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నామన్నారు.
మంగళవారం మధ్యాహ్నం జరిగిన దాడిలో 26మంది మృతిచెందారు. వారిని ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు చేరుస్తున్నారు అధికారులు. పహల్గా ఘటనతో కాశ్మీర్ లో ఉన్న టూరిస్టులందరూ ప్రాణభయంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ పై భారత్ దౌత్యపరమైన నిర్ణయాలను తీసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఛీప్ మునిర్ వ్యాఖ్యలే దాడికి కారణమని ప్రపంచ దేశాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిర్ కు ఒసామాబిన్ లాడెన్ కు తేడా లేదని అమెరికా మాజీ అదికారి విమర్శించారు.