Who is Abdul Rauf Azhar?: ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం.. ఎన్ని దాడులు చేశాడంటే?

Most Wanted Terrorist Abdul Rauf Azhar, Jaishe Mohammad leader Killed in India Army Strikes: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు అద్భుత విజయం సాధించాయి. భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడార్‌పై ఉన్న ఉగ్రవాది, ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ హతం అయ్యాడు. అమెరికా చేయలేని పనిని భారత భద్రతా దళాలు చేశాయి. ఇంతకీ అబ్దుల్ రవూఫ్ అజార్ ఉగ్రవాద చరిత్రి ఏమిటి ?
అబ్దుల్ రవూఫ్ అజార్ …ఒక కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహమ్మద్ లో దాదాపు రెండో నెంబర్ లో ఉన్న టెర్రరిస్టు. మసూద్ అజార్ కు స్వయానా తోడబుట్టినవాడు. కాగా అబ్దుల్ రవూఫ్ అజార్ ను మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వ దళాలు గతంలో అనేక సార్లు ప్రయత్నించాయి. అయితే అందినట్లే అంది చివరిక్షణంలో తప్పించుకునేవాడు అబ్దుల్ రవూఫ్ అజార్. అయితే ఈసారి అజార్ కు ఆ అవకాశం ఇవ్వలేదు భారత భద్రతా దళాలు. అజార్ ఆనుపానులు కనిపెట్టిన మెరుపుతీగల్లాంటి భారత సైనికులు సరిగ్గా అక్కడే గురి చూసి కొట్టారు. దీంతో అబ్దుల్ రవూఫ్ అజార్ ప్రాణాలు కోల్పోయాడు. అజార్ ను మట్టుబెట్టడం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయింది.
కాందహార్ విమాన హైజాక్ ..ఇప్పటికీ ఈ సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా ఈ సంఘటన నిలిచిపోయింది. దీనినే ఐసీ – 814 విమాన హైజాక్ అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో కాందహార్ విమాన హైజాక్ మాస్టర్ మైండ్ గా అబ్దుల్ రవూఫ్ అజార్ ను పేర్కొంటాయి భారత భద్రతా దళాలు. ఐసీ – 814 విమానం హైజాక్ జరిగేనాటికి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ భారత జైల్లో ఉన్నాడు. మౌలికంగా మసూద్ అజార్ ను జైలు నుంచి విడిపించడమే కాందహార్ విమాన హైజాక్ అసలు ప్లాన్. ఇందుకోసం ఒక ప్లాన్ రచించాడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఈ ప్లాన్ ప్రకారం నేపాల్ లో సాధారణ ప్రయాణీకుల్లా విమానంలోకి ఉగ్రవాదులు ఎక్కారు. కాక్ పిట్ లోకి వెళ్లి, తాము విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. విమానాన్ని షెడ్యూల్ ప్రకారం కాకుండా, కాందహార్ కు తరలించాలని పైలెట్, కో పైలెట్ పై ఒత్తిడి తెచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తే, ప్రాణాలు తీస్తామని గన్ లతో పైలెట్, కో పైలెట్ ను బెదిరించారు. దీంతో విమానాన్ని కాందహార్ కు మళ్లించారు సిబ్బంది.
విమానం కాందహార్ చేరుకున్న తరువాత తమ డిమాండ్లను బయటపెట్టారు హైజాకర్లు. జైల్లో ఉన్న ఉగ్రవాది మసూద్ అజార్ ను విడుదల చేయాలని అప్పటి వాజ్ పేయి సర్కార్ ను డిమాండ్ చేశారు. తమ డిమాండ్ అంగీకరించని పక్షంలో విమానాన్ని పేల్చి వేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హై జాకర్లతో చర్చలు జరపడానికి ఒక ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా ఈ బృందంలో ఉన్నారు. అటు హైజాకర్లు ఇటు భారత ప్రభుత్వ బృందం మధ్య చర్చలు జరిగాయి.
ఒక దశలో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ, చివరకు చర్చలు కొనసాగించడానికి ఉభయులూ అంగీకరించారు. దీంతో మసూద్ అజార్ ను జైలు నుంచి విడుదల చేశారు. అందుకు బదులుగా ఐసీ – 814 విమానం నుంచి హైజాకర్లు వైదొలగారు. ఫలితంగా కాందహార్ విమానంలోని ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విధంగా కాందహార్ విమాన హైజాక్ ఎపిసోడ్ సుఖాంతం అయింది. మొత్తంమీద ఆపరేషన్ సింధూర్ సాధించిన అనేకానేక అద్బుత విజయాల్లో అబ్దుల్ రవూఫ్ అజార్ ను హతమార్చడం ఒకటి. ఒక్కమాటలో చెప్పాలంటే అజార్ మృతి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్ వర్క్ కు అలాగే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని దెబ్బ కిందే లెక్క.