CM Jagan: వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదే.. సీఎం జగన్
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
Amaravati: వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాల పై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు విషయమై ఒక్క పైసా తీసుకోవడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపుతో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవన్నారు. క్వాలిటీ లేకపోతే రైతు నష్టపోతాడన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయమై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు.
వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పీడర్లు, సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయడం కోసం రూ. 1700 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ కారణంగానే పగటిపూట రైతులకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. అంతేకాదు ప్రతి ఏటా దీని కోసం రూ. 9 వేల కోట్లను చెల్లిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. 18 లక్షల 70వేల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సుమారు రూ. 9 వేల కోట్లు బకాయిలు పెడితే ఆ భారాన్ని కూడా తామే చెల్లించినట్టుగా జగన్ తెలిపారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే ఆ కుటుంబానికి రూ. 7 లక్షలను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చెప్పారు. ఏపీలో 10,775 ఆర్బీకేలను ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, ఆర్బీకేలను ప్రశంసించాయని గుర్తుచేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని తెలిపారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క మండలంలోనూ కరవు లేదని, ఈ మూడేళ్లలో సీమకు అత్యధికంగా నీళ్లు ఇచ్చామని జగన్ వివరించారు.