Operation Sindoor: పాక్ టెర్రర్ క్యాంపులు ధ్వంసం.. త్రివిధ దళాల ప్రెస్ మీట్

Indian Army Destroyed Pakistani Terrorist Base Camps: పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాద అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్’ నిర్వహించామని భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారిగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజిఎంఓ మీడియా ముందుకు వచ్చారు. కాగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లోని మొత్తం 9 టెర్రర్ క్యాంప్ లలో కొన్ని పాకిస్తాన్ లో ఉండగా, మరికొన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయని చెప్పారు. దాడుల్లో వాటిని పూర్తిగా నేలమట్టం చేశామని ఆర్మీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
పహల్గామ్ దాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారని.. అందుకు సమాధానంగా తాము జరిపిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు చెప్పారు. కాగా తాము జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సాధారణ పౌరలపై దాడులకు పాల్పడిందని అధికారులు వెల్లడించారు. అందుకు భారత సైనిక దళాలు తగిన విధంగా బదులిచ్చాయని తెలిపారు. కాగా 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఐసీ 814 హైజాక్ ఘటన, 2019లో పుల్వామా దాడుల్లో పాల్గొన్న ముష్కరులను హతం చేశామని ప్రకటించారు. వీరిలో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ ఉన్నారని చెప్పారు.
దాడుల తర్వాత భారత్ పై పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వాటన్నింటినీ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ దాడులకు జవాబుగా పాక్ రాడార్ స్టేషన్, ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడులు నిర్వహించామని వివరించారు. కాగా దాడుల్లో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని.. మరోవైపు భారత్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని చెప్పారు. పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతీ డ్రోన్ ను ధ్వంసం చేశామని పేర్కొన్నారు.
లాహోర్, గుజ్రన్ వాలా రాడార్ కేంద్రాలపై దాడులు జరిపామని.. కచ్చితమైన లక్ష్యాలతో పాక్ ఆర్మీ స్థావరాలపై దాడి చేశామన్నారు. కాగా భారత్ జరిపిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు భావిస్తున్నామని చెప్పారు.