Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు

ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్‌లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్‌పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో విడుదల రజినిని అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చడంతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 7, 7 ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా మాజీ మంత్రి విడుదల రజిని మరిది విడుదల గోపి, ఏ4గా విడుదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ పేర్లను చేర్చారు.
ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజినితో పాటు అప్పటి గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా, మరికొంకొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారిపై విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకుంది. అలాగే మాజీ మంత్రి విడుదల రజినిని పైతం విచారణ చేపట్టేందుకు అనుమతి కోసం గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసింది. అక్కడి నుంచి అనుమతి రావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.