Last Updated:

KTR: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు .. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మారిస్తే చరిత్ర క్షమించదు

KTR: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు .. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మారిస్తే చరిత్ర క్షమించదు

KTR Challenge To CM Revanth Reddy: మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్‌ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేసీఆర్ చెప్పారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయి అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తుచేశారు. దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిగిందని, తెలుగుతల్లి విగ్రహ రూపం మారలేదన్నారు. కన్నడమాత విగ్రహం రూపు మారలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. నాలుగేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని, అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయన్నారు. ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదని కేటీఆర్‌ హెచ్చరించారు.

125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం గురించి మాట్లాడారా.?
కేసీఆర్ మీద కోపంతో ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్ర‌హాల గురించి రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తాడని, కానీ కేసీఆర్ హ‌యాంలో ఏర్పాటు చేసిన‌ 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం గురించి మాట్లాడారన్నారు. శ్వేత‌సౌధం లాంటి అంబేద్క‌ర్ స‌చివాల‌యం, పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ గురించి ఒక్క మాట రాదన్నారు. ఈ పదేళ్ల‌లో జ‌రిగిన నిర్మాణాల గురించి సీఎంకు మాట రాదని చెప్పారు. ప‌రాజితుల చ‌రిత్రను చెరిపేయాల‌నే మూర్ఖ‌పు నాయ‌కులు ఉన్నారని, కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ‌ త‌ల్లి రూపాన్నే మార్చే ప్ర‌య‌త్నం చేస్తే చ‌రిత్ర క్ష‌మించ‌దన్నారు.

వ‌చ్చే ఏడాది నుంచి సాహితీ కార్య‌క్ర‌మాలు..
ప్ర‌తి ఏడాది దీక్షా దివ‌స్ సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 29 నుంచి డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు విస్తృతంగా సాహితీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌ను హైద‌రాబాద్ స‌హా పాత జిల్లాల కేంద్రంగా నిర్వ‌హిస్తామన్నారు. సాహిత్య కార్య‌క్ర‌మాలు, పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు చేసుకుందామ‌ని కేటీఆర్ చెప్పారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు కేసీఆర్ నాయ‌క‌త్వంలో మూడు రోజులు ఘ‌నంగా నిర్వ‌హించామన్నారు. కాళోజీ క‌ళాక్షేత్రం వ‌రంగ‌ల్‌లో క‌ట్టినా.. ఇత‌ర జిల్లాల్లో కాళోజీ క‌ళాభార‌తి పేరిట నిర్మించామన్నారు. సాహితీవేత్త‌ల‌కు, ర‌చ‌యిత‌ల‌కు కేసీఆర్ పెద్ద‌పీట వేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.

కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు
కార్య‌క్షేత్రంలో ప్ర‌తి రోజు కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో త‌ల‌ప‌డుతున్న బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు, కేసుల‌కు వెర‌వ‌కుండా సింహాల్లా పోరాడుతున్న మా పార్టీ నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మ‌రో నాలుగేండ్లు ఈ పోరాటాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాల‌న్నారు. ఈ రోజు తెలంగాణ భ‌వ‌న్ జ‌న‌తా గ్యారేజ్‌గా మారిందని, హైడ్రా, మూసీ బాధితుల‌తోపాటు ప‌లువురు క్యూ క‌డుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ బాధితులు త‌మ వేద‌న‌ను చెప్పుకుంటున్నారని తెలిపారు. సోష‌ల్ మీడియా సైనికుల‌కు, ప్ర‌తి రోజు కాంగ్రెస్‌తో త‌ల‌ప‌డుతున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రాహుల్ గాంధీకి లేఖ రాస్తా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై త్వరలో రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంతోషంగా లేరన్నారు. సీఎం రేవంత్ సోదరులు ఇద్దరు తప్ప ఎవరూ బాగుపడలేదని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ కాదు.. రేవంత్ బ్రదర్ రైజింగ్ అన్నారు.