Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై రేవంత్‌రెడ్డి, చంద్రబాబు స్పందన

Chandrababu Naidu, Revanth Reddy Reacts on Virat Kohli’s Test Retirement: టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల ముఖ్యముంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు స్పందించారు. విరాట్ నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చాయని వారు కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
కోహ్లీ దేశానికే గర్వకారణం : సీఎం చంద్రబాబు
టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ రిటైర్మెంట్‌తో భారత్ క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రికెట్‌లో కోహ్లీ అభిరుచి, క్రమశిక్షణ చాలా మందిలో స్ఫూర్తిని నింపాయని తెలిపారు. విరాట్ దేశానికే గర్వకారణమని, అతడి నెక్ట్స్ ప్రయాణం విజయపథంలో సాగాలని సీఎం ఆకాంక్షించారు.
నిబద్ధత కలిగిన ఆటగాడు : సీఎం రేవంత్
ఇండియా క్రికెట్ చరిత్రలో విరాట్ ఒక గొప్ప పేరుగా నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కొనసాగించాడని ప్రశంసించారు. అనేక రికార్డులు సృష్టించారని తెలిపారు. మంచి క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగుతున్నందున మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.