TGSRTC: రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TGSRTC Runs Special Buses: ప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకుగాను తెలంగాణ నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్టు సమాచారం. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతోపాటు.. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దేవగురువు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు రానున్నాయి. సంవత్సరంపాటు బృహస్పతి ఇదే రాశిలో ఉండనున్నాడు. దీంతో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అంటారు. పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు రూ. 25 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రేపు కాలేశ్వరం వెళ్లనున్నారు.
అయితే సరస్వతి పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడిపించాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సులు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్ ప్రాంతాల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పింది. అలాగే 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలనుకునే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్ల కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నెంబర్లను సంప్రదించాలని కోరారు.