Last Updated:

Trump tariffs : అమెరికా ప్రతీకార సుంకాలు.. ఏడాదికి ఆదాయం ఎంత అంటే?

Trump tariffs : అమెరికా ప్రతీకార సుంకాలు.. ఏడాదికి ఆదాయం ఎంత అంటే?

Trump tariffs : ఇండియాతోపాటు అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీటిపై ప్రకటన చేయనుండగా, వెంటనే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ఏటా భారీస్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా 600 బిలియన్ల నుంచి 700 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేసింది.

 

 

 

కొత్త టారిఫ్‌ల వల్ల ఏటా 600 బిలియన్‌ డాలర్లు..
చైనా, కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మరికొన్ని వస్తువులపై భారీగా ఉండనున్నాయనే సంకేతాలు ఇచ్చారు. వీటివల్ల అమెరికాకు ఎంత మేరకు ఆదాయం సమకూరుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో మాట్లాడారు. నూతన టారిఫ్‌లతో ఏటా 600 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆటో టారిఫ్‌ల వల్ల మరో 100 బిలియన్‌ డాలర్లు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో 6 ట్రిలియన్‌ డాలర్లు సమకూరనున్నట్లు పేర్కొన్నారు.

 

 

ఆదాయం కష్టమే..
ఇదే విషయంపై ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడారు. అమెరికా విధించే సుంకాలపై పరిమితి ఉంటుందని, ఆయా దేశాలతో చర్చల అనంతరం వీటిని తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. వైట్‌హౌస్‌ మాత్రం వీటి విధానానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. వైట్‌హౌస్‌ వర్గాల అంచనా కంటే ఆదాయం తక్కువే ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వైట్‌హౌస్‌ వర్గాలు చెబుతున్నట్లుగా అంత ఆదాయం వచ్చే అవకాశం లేదని, 100 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్లు వస్తే అదృష్టమని మూడీ చీఫ్‌ ఎకానమిస్ట్‌ మార్క్‌ జాండీ పేర్కొన్నారు.

 

 

పన్నుల భారమేనా..?
దిగుమతులపై సరాసరి 20శాతం పన్ను విధిస్తే ఒక్కో కుటుంబంపై అదనంగా 3400 డాలర్ల నుంచి 4200 డాలర్ల భారం పడనున్నట్లు యేల్‌ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తులను పెంచడం వల్ల ఆ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది. ట్రంప్‌ విధానం కచ్చితంగా సరైందేనని వైట్‌హౌస్‌ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజలు, మిత్రదేశాలు మాత్రం సుంకాలను ముప్పుగానే భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: