South Korea: కిమ్ సైన్యంపై హెచ్చరికల కాల్పులు.. దక్షిణ కొరియా వెల్లడి!

Warning Shots Fired at North Korean Military: ఉత్తర కొరియా దేశ సైన్యంపై హెచ్చరికల కాల్పులు చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. సరిహద్దులోని తూర్పు భూగంలో కిమ్ సైన్యం ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో హెచ్చరికలు చేయడంతోపాటు వార్నింగ్ షాట్లు ఇచ్చామని పేర్కొంది. దీంతో 10 మంది కిమ్ సైనికులు తిరిగి వారి భూభాగంలోకి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఉత్తర కొరియా కార్యకలాపాలను సున్నితంగా గమనిస్తున్నామని వెల్లడించింది.
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సైనిక రహిత ప్రాంతంలో ఉల్లంఘనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత జూన్ నెలలో కిమ్ సైన్యం సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడింది. శత్రుసైన్యం ఉద్దేశపూర్వకంగా చొరబడలేదని దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోలేదు. తాజా చొరబాటు వెనుక ఉద్దేశంపై మాత్రం స్పష్టత రాలేదు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్న ఉత్తర కొరియా అటు అణ్వాయుధ ప్రయోగాలను ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంది. అణు నిరాయుధీకరణ చర్చలను పునఃప్రారంభించాలని అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాలు పిలుపు ఇస్తున్నప్పటికీ కిమ్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు. కిమ్ తనకు మంచి స్నేహితుడని, దౌత్య సంబంధాలు మెరుగుపర్చేందుకు కిమ్‌తో భేటీ కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. ఇప్పటి వరకూ ఉత్తర కొరియా నుంచి ఎటువంటి స్పందన లేదు.