Bangladesh : లుంగీలోనే దేశం విడిచి పారిపోయిన బంగ్లా మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్

Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్‌లాండ్ విమానం ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.
హమీద్ అవామీ లీగ్ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఎంపీగా ఎన్నికయ్యారు. 2013 నుంచి 2023 మధ్య షేక్ హసీనా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. అనంతరం అవామీ లీగ్ హయాంలో ఆందోళనకారులపై దాడులు, హత్యల ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో హమీద్‌పై హత్య కేసు నమోదైంది.
అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న 81 ఏళ్ల హమీద్ గతవారం ఢాకా అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కినట్లు కథనాలు వచ్చాయి. అతడి వెంట సోదరుడు, బావ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో ఆయన దృశ్యాలు బయటకు వచ్చాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో లుంగీలో ఉన్న హమీద్ ఎయిర్ పోర్టుకు వచ్చినట్లుగా అందులో ఉంది.
దీంతో యూనస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. మరికొందరినీ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. హమీద్ వైద్య చికిత్స కోసం థాయ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విచారణ నుంచి తప్పించుకునేందుకే పారిపోయినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అవామీ లీగ్, పార్టీ నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది.