Najib Razak: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష
అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
Malaysia: అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. నజీబ్ అప్పీల్లో మెరిట్ లేదని, ఆయన శిక్షను వెంటనే అమలు చేయాలని చీఫ్ జస్టిస్ మియామున్ ట్వాన్ మాట్ తీర్పిచ్చారు. కోర్టు తీర్పుతో నజీబ్, ఆయన ఫ్యామిలీ, మద్దతుదారులు విచారంలో మునిగిపోయారు. మాజీ ప్రధానులలో జైలుపాలైన తొలి వ్యక్తి నజీబ్ రజాక్. 1 మలేసియా డెవలప్మెంట్ బెర్హాద్(1ఎండీబీ) స్కాం కేసులో హైకోర్టు నజీబ్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై నజీబ్ ఫెడరల్ కోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. అక్కడా చుక్కెదురైంది. నజీబ్‌కు శిక్ష విధించడం సబబేనని ఫెడరల్ కోర్టు ప్యానెల్ తేల్చి చెప్పింది. ఈ కేసులో ఇదే తుది తీర్పు కావడంతో నజీబ్ ఇక జైలుకెళ్లక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి.
ఇక మలేసియా ప్రధానిగా 2009లో నజీబ్ రజాక్ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే 1ఎండీబీ పేరుతో డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫండ్‌లో అక్రమాలు జరిగాయని, నిధులను నజీబ్ తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లు కాజేశారని ఆడిట్లో తేలింది. 1ఎండీబీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్సంస్థ నిధుల్లోనూ గోల్మాల్ జరిగిందని, 9.4 మిలియన్డాలర్లు అక్రమంగా వాడుకున్నారని బయటపడింది.
ఈ డబ్బును విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపేందుకు, ఖరీదైన వాహనాల కొనుగోలుకు ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై సొంత ప్రభుత్వంలోని పలువురు సభ్యులు ఆరోపణలు గుప్పించగా, వాళ్లందరినీ నజీబ్ పదవుల నుంచి తొలగించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నజీబ్ పదవిని కోల్పోయారు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో 2020లో కోర్టు నజీబ్‌ను దోషిగా తేల్చింది. హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఇక ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయ్యింది. తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోయారు.