Kejriwal: ఫలితాల వేళ కొత్త పంచాయితీ.. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం!
![Kejriwal: ఫలితాల వేళ కొత్త పంచాయితీ.. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/ACB.jpg)
Kejriwal says BJP trying to poach AAP candidates: ఢిల్లీలో మరికొన్ని గంటల్లో ఎన్నికలు ఫలితాల లెక్కింపు జరగనున్న వేళ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో హస్తినలో హైడ్రామా నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీచేసిన 16 మంది అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందంటూ కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు. కాగా, దీనిపై స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించగా, శుక్రవారం ఏసీబీ బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి నోటీసులిచ్చే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తలా రూ. 15 కోట్లు ఆఫర్
గురువారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ కొనేందుకు ‘ఆపరేషన్ లోటస్’ను ప్రారంభించిందని, ఇప్పటిదాకా 16 మందికిపైగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయని లెక్కలు చెప్పారు. ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ స్పందిస్తూ.. వెంటనే ప్రభుత్వం దీనిపై ఏసీబీ విచారణ చేపట్టాలని ఆదేశించారు.
రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్
కాగా, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించారు. ఏసీబీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, ఏసీబీ అధికారుల బృందాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకోవటంతో అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. అయితే, అంతకు ముందే ఆప్ అభ్యర్థులు కూడా ఈ గొడవలో భాగస్వాములు కావటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కాగా, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ బృందం ప్రకటించింది.
కౌంటింగ్‌కు సర్వంసిద్ధం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఈసీ ప్రత్యేకంగా 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత 8.30 కి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంల్ కౌంటింగ్ వద్ద ఈసీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అధికారంలో ఉన్న ఆప్, బీజేపీ అధికారంపై ధీమాగా ఉన్నాయి.