Last Updated:

Tihar Jail : మరో ప్రాంతానికి తిహార్ జైలు తరలింపు.. ఢిల్లీ సర్కారు నిర్ణయం

Tihar Jail : మరో ప్రాంతానికి తిహార్ జైలు తరలింపు.. ఢిల్లీ సర్కారు నిర్ణయం

Tihar Jail : ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి మార్చేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైంది. సీఎం రేఖా గుప్తా మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసేలా సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

 

 

జైలు విస్తీర్ణం, ఖైదీల కారణంగా దాని చుట్టుపక్కల నివసించేవారి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ జైలును 1958 సంవత్సరంలో నిర్మించారు. మొత్తం 9 జైళ్లతో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1966లో జైలు నిర్వహణను పంజాబ్‌ సర్కారు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. దేశ రాజధానిలో ప్రధాన జైలుగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 19వేల మంది ఖైదీలు ఉన్నారు. తిహార్, మండోలి, రోహిణి మూడు జైళ్లు 10వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. ఇటీవల ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు 6 చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

 

ప్రజల సొమ్ముతో శీష్‌మహల్‌ కట్టుకున్నారు..
ఢిల్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల డబ్బుతో శీష్‌ మహల్‌ కట్టారంటూ ఆమె ఆరోపించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రజల ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం మరమ్మతుల పేరిట కేజ్రీవాల్‌ రూ. 45 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఢిల్లీని లండన్‌గా మారుస్తానని ట్రాఫిక్‌ జామ్‌లకు నిలయంగా మార్చేశారని ఆరోపించారు. వారు చేపట్టిన ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.

 

 

ఆప్‌, బీజేపీ మధ్య చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు. మీరు (ఆప్‌ను ఉద్దేశిస్తూ) వాగ్దానాలు చేస్తారని, కానీ, తమ ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుందన్నారు. మీరు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాము మాత్రం కలిసి కట్టుగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. మీరు ప్రజల సొమ్ముతో శీష్ మహల్‌, బంగారు టాయిలెట్లు కట్టుకున్నారని, బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. అందుకు ప్రణాళికలను రచిస్తోందని సీఎం తెలిపారు. ఇందుకు రూ. 177 కోట్లను కేటాయించామన్నారు. దీనిలో భాగంగా శీష్‌మహల్‌ను చూసేందుకు ప్రజలను అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: