Pahalgam: రష్యా ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని మోదీ

Pahalgam: ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతును ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ వెల్లడించారు. పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాంలో హేయమైన చర్య జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య విశేష భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్థతను చాటుకున్నారు.
రష్యా విజయోత్సవ దినోత్సవమైన 80వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ, పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తిఅయింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే విజయ దినోత్సవానికి హాజరు కావాలని ప్రధాని మోదీని రష్యా ఆహ్వానించింది.
పహల్గామ్ దాడి తర్వాత భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ రష్యాను అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కార్యక్రమానికి హాజరుకావడంలేదు. భారత్ తరపున రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ హాజరుకానున్నారు. అయితే గతంలో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రెండు సార్లు హాజరయ్యారు. 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు భారత్ ను సందర్శిచనున్నారు. పహల్గాం దాడికి ప్రతీకార చర్యల్లో భారత్ తలమునకలైఉంది. పాకిస్థాన్ ఇప్పటికే రెండు క్షిపణులను పరీక్షించింది.