Last Updated:

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ నుంచి 5వ మహిళా సీఎంగా గుర్తింపు!

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ నుంచి 5వ మహిళా సీఎంగా గుర్తింపు!

Rekha Gupta takes oath as CM of Delhi: ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు.

అయితే, దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

అంతకుముందు రేఖా గుప్తా హనుమాన్ టెంపుల్‌లో పూజలు నిర్వహించారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో అందరినీ పలకరించారు. ఆమెతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు. ఇక, ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎంకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించనున్నారు.

రేఖా గుప్తా.. హరియాణాలోని జులానాలో 1974 జులై 19న జన్మించింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న దౌలత్ రామ్ కాలేజీలో బీకాం చదివిన ఆమె.. ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా, 1996-97లో అధ్యక్షురాలిగా పనిచేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు.

ఇక, 2007లో నార్త్ పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా రేఖా గుప్తా గెలుపొందారు. అనంతరం సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమెకు ఆర్ఎస్ఎస్‌లో సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అక్కడి నుంచి బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఇక, బీజేపీ నుంచి ఇప్పటివరకు సుష్మాస్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా రేఖా గుప్తా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి: