Last Updated:

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. నేడు రామ్‌లీలా మైదానంలో ప్రమాణం

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. నేడు రామ్‌లీలా మైదానంలో ప్రమాణం

Rekha Gupta Named Next Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇటీవల గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి రేఖా గుప్తాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలంతా కలిసి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం, మంత్రుల చేత లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కీలక భేటీలో చర్చ..
ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ సమావేశమైంది. జేపీ నడ్డా, అమిత్ షా తదితర నేతలు దీనికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జరగాల్సిన సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్‌కర్‌ను ఎంపిక చేశారు. ఈ పరిశీలకులు ఎమ్మెల్యేలతో మాట్లాడి, వారి అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో అధిష్ఠానానికి అప్పగించారు. అనంతరం ఆ అభిప్రాయాన్నే లెజిస్టేచర్ పార్టీలో పరిశీలకులు ప్రకటించగా, ఎమ్మెల్యేలంతా తమ మద్దతును ప్రకటించారు.

కొత్త సీఎం నేపథ్యం
ఇక.. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేఖా గుప్తా పార్టీలో దీర్ఘకాలంగా పలు హోదాలలో సేవలందించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్‌గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ కార్యదర్శిగానూ పని చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బనియా వర్గానికే పీఠం..
ఢిల్లీ రాజకీయాల్లో బనియా సామాజిక వర్గానిది కీలక పాత్ర. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించేందుకు బనియా వర్గం ఓట్లు దోహదం చేసినట్లు హస్తిన రాజకీయాల్లో తలపండిన నేతలు చెబుతున్న మాట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు వాణిజ్యం, వ్యాపారం,రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అటు.. కేజ్రీవాల్‌ సైతం బనియా సామాజిక​ వర్గం. కాబట్టే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకే పీఠం ఇవ్వాలని బీజేపీ భావించింది. .

ఘనంగా ఏర్పాట్లు
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గానూ 48 సాధించిన బీజేపీ 27 ఏళ్ల తర్వాత విజయకేతనం ఎగరేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమ సమన్వయకర్తలుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రామ్ లీలా మైదాన్‌లో ఘనంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ పక్షాల సీఎంలు, కీలక నేతలు హాజరవుతున్నారు. సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులు బస చేయడానికి టెంట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు పలు దేశాల దౌత్యవేత్తలు దీనికి హాజరకు కానున్నారు.

ఇవి కూడా చదవండి: