CM Revanth Reddy: బీసీలు ధర్మ యుద్ధం ప్రకటించాలి.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy Sentational Comments BC Poru Garjana In Delhi: రిజర్వేషన్ల విషయంలో బీసీలు గొంతు వినిపించాలని, అవసరమైతే ధర్మయుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కోర్టులు సైతం స్పష్టంగా చెప్పాయన్నారు. జనాభా తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని చెప్పినట్లు గుర్తు చేశారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్కలు తెలియాలన్నారు.
బీసీల గొంతుక వినిపించాలని, జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. దామాషా ప్రకారం.. నిధులు, నియామకాలు చేపడుతామన్నారు. అయితే బీసీలను బలపర్చేందుకు నిర్ణయం తీసుకోగా.. ఈ విషయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. అందుకే 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇక నుంచి ఢిల్లీకి వచ్చేది లేదని, ప్రధాని మోదీయే గల్లీలకు రావాలని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని, లేని సమక్షంలో ప్రధాని మోదీ దిగిపోవాలన్నారు.